రంగారెడ్డి జిల్లా: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైన్ షాపుల కేటాయింపులో గీత కార్మికులకు రిజర్వేషన్లు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని బీఏంఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రంలో గీత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గౌడన్నలకు ప్రతి నెలా 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. గీత కార్మికులకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. గతంలో గౌడ సొసైటీ రెన్యూవల్ లో అనేక ఇబ్బందులు ఉండేవని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక వాటిని తొలగించారని గుర్తు చేశారు. తాటి వనాల కోసం గీత కార్మికులకు మొక్కలతో పాటు అనేక సబ్సిడీలు కల్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్ లో వాళ్లకు మోపెడ్ బండ్లు కూడా ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కల్లు గీత వృత్తిని బ్యాన్ చేశారని, గీత కార్మికులు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో బలహీన వర్గాల నుంచి ఒక్క మంత్రి కూడా లేరని, బలహీన వర్గాల నుంచి ఒక్కరికైనా మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని మోడీని డిమాండ్ చేశారు. మునుగోడులో ప్రతిపక్షాలు చెప్పే మాటలు విని మోసపోవద్దని, టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ కోరారు.